Team India: టీమిండియా ముందు 'చారిత్రక' అవకాశం!
- సఫారీలతో టీమిండియా టెస్టు సిరీస్
- గతంలో చేజారిన విజయం
- ఈసారి బలంగా ఉన్న టీమిండియా
- అదే సమయంలో బలహీనంగా దక్షిణాఫ్రికా
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. గతంలో భారత జట్టు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ విజయం అందుకోలేకపోయింది. విదేశీ గడ్డపై టీమిండియా ఇప్పుడు మెరుగైన ఆటతీరు కనబరుస్తోంది కానీ, ఒకప్పుడు పేస్ పిచ్ లపై తడబాటుకు గురయ్యేది. ప్రత్యర్థి జట్టులోని అనామక బౌలర్లకు కూడా భారత బ్యాటింగ్ లైనప్ దాసోహమైన ఘటనలు ఉన్నాయి.
కానీ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా విదేశీ జట్లును వారి సొంతగడ్డపైనే చిత్తు చేస్తూ అనతికాలంలోనే మేటి జట్టుగా ఎదిగింది. ఇటీవల ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించడం, ఇంగ్లండ్ పై టెస్టు సిరీస్ లో ఆధిపత్యం సాధించడం ఈ కోవలోకే వస్తాయి. అయితే, దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం భారత జట్టుకు అందని ద్రాక్షగానే ఉండిపోయింది. గతంలో సఫారీ గడ్డపై పలు టెస్టులు గెలిచినా, సిరీస్ మాత్రం ఊరిస్తూనే ఉంది.
ఇన్నాళ్లకు టీమిండియా ముందు సదవకాశం నిలిచింది. గతంతో పోల్చితే డీన్ ఎల్గార్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఎంతో బలహీనంగా కనిపిస్తోంది. డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్, హషీమ్ ఆమ్లా, మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ వంటి ఉద్ధండులు జట్టులో లేరు. తాజా సిరీస్ లో చాలా మంది పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేనివాళ్లే ఆడుతున్నారు. మరోవైపు, దక్షిణాఫ్రికా క్రికెట్ పెద్దలు సైతం వివాదాల్లో చిక్కుకున్నారు. దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న గ్రేమ్ స్మిత్, జట్టు కోచ్ మార్క్ బౌచర్ గతంలో జాతి వివక్షకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష అంశం ఎంతో సున్నితమైనది. వీరిద్దరిపై ఆరోపణలు నిరూపితమైతే తీవ్ర చర్యలు తప్పవు.
ఇలాంటి పరిస్థితుల్లో సఫారీ జట్టు నుంచి టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ను ఆశించడం అత్యాశే అవుతుంది. ఆ విషయం సెంచురియన్ టెస్టు తొలిరోజే స్పష్టమైంది. సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో పిచ్ పై పచ్చిక ఉన్నప్పటికీ సఫారీ పేసర్లు ఏమంత రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికన్ల పేస్ ను సులువుగా ఆడేస్తూ టీమిండియా ఓపెనింగ్ జోడీ తొలి వికెట్ కు 100కి పైగా పరుగులు జోడించారు. ఇది ఓ సానుకూలాంశం.
టీమిండియా గతంతో పోలిస్తే ఇప్పుడెంతో బలంగా ఉంది. పలు విదేశీ పర్యటనల్లో రాటుదేలిన ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈసారి సిరీస్ ను వదలరాదని కృతనిశ్చయంతో ఉంది.