Taliban: తాలిబన్ల మరో నిర్ణయం.. ఎన్నికల సంఘాల రద్దు!

Talibans Dissolve Afghanistan Two Election Commissions
  • రెండు ఎన్నికల సంఘాల రద్దు
  • స్వతంత్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ఫిర్యాదు సంఘాల ఎత్తివేత
  • శాంతి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలూ రద్దు
తాలిబన్లు మరో అరాచక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కట్టుబొట్టు, కట్టుబాట్లు అంటూ మహిళలు, పురుషులకు ఆంక్షలు పెట్టిన తాలిబన్లు.. ఇప్పుడు దేశ నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశమే లేకుండా తమ నిరంకుశ ప్రభుత్వానికి రాచబాటలు వేసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లోని రెండు ఎన్నికల సంఘాలను రద్దు చేశారు. వాటితో పాటు శాంతి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలనూ ఎత్తేసింది. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బిలాల్ కరీమి వెల్లడించాడు.

స్వతంత్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ఫిర్యాదు సంఘాలను తాలిబన్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ప్రకటించాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ఉన్న స్థితిలో ఆ రెండు చట్టబద్ధ సంస్థలు అనవసరమని వ్యాఖ్యానించాడు. భవిష్యత్ లో వాటి అవసరం ఉందనిపిస్తే తాలిబన్ ప్రభుత్వం మళ్లీ వాటిని తీసుకొస్తుందన్నాడు. కాగా, ప్రస్తుతం ప్రపంచం గుర్తింపు పొందేందుకు ఆరాటపడుతున్న తాలిబన్లు.. ఎన్నికల సంఘాలు, కీలకమైన మంత్రిత్వ శాఖలను రద్దు చేసి మరింత క్లిష్టం చేసుకున్నారు.

మరోపక్క, ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేది లేదని అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. తాలిబన్లు వినియోగించుకోవడానికి వీల్లేకుండా ఆఫ్ఘనిస్థాన్ ఆస్తులను అమెరికా ఫ్రీజ్ చేసింది. ఆ నిధులను విడిపించాలని ఎప్పటి నుంచో తాలిబన్లు కోరుతున్నా.. అమెరికా మాత్రం ససేమిరా అంటోంది. తాలిబన్ల అరాచక పాలనతో పిల్లలకు పాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఉపాధి లేక చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలూ ఆకాశాన్నంటేశాయి.
Taliban
Afghanistan
Election Commission

More Telugu News