Mahendra Prasad: పార్లమెంటు సభ్యుడు, పారిశ్రామికవేత్త మహేంద్ర ప్రసాద్ మృతి!
- అనారోగ్యంతో బాధపడుతూ మహేంద్ర ప్రసాద్ మృతి
- ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నితీశ్ కుమార్
- అత్యంత సంపన్నులైన ఎంపీల్లో మహేంద్ర ప్రసాద్ ఒకరు
మన దేశ అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన మహేంద్ర ప్రసాద్ మృతి చెందారు. జనతాదళ్ యునైటెడ్ కు చెందిన ఆయన ఏడు సార్లు రాజ్యసభకు, ఒకసారి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. బీహార్ కు చెందిన మహేంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్త కూడా. అరిస్టో ఫార్మా కంపెనీని ఆయన స్థాపించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 81 సంవత్సరాలు.
మహేంద్ర ప్రసాద్ మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతి సమాజానికి, రాజకీయ రంగానికి తీరని లోటు అని అన్నారు. మహేంద్ర ప్రసాద్ 1980లో కాంగ్రెస్ టికెట్ పైన తొలిసారి లోక్ సభ అభ్యర్థిగా గెలుపొందారు. చాలా కాలం పాటు ఆయన కాంగ్రెస్ తోనే ఉన్నారు. ఆ తర్వాత బీహార్ లో కాంగ్రెస్ ప్రాబల్యం కోల్పోవడంతో జేడీయూలో చేరారు. మన దేశంలో అత్యంత ధనవంతులైన ఎంపీల్లో మహేంద్ర ప్రసాద్ కూడా ఒకరు కావడం గమనార్హం.