lic policy bond: ఎల్ఐసీ పాలసీ పత్రం కనిపించడం లేదా..? డూప్లికేట్ ఇలా తీసుకోవచ్చు
- పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలి
- డూప్లికేట్ పాలసీకి దరఖాస్తు సమర్పించాలి
- ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రకటన ఇవ్వాల్సి రావచ్చు
- నిర్ణీత చార్జీల చెల్లింపుల తర్వాత డూప్లికేట్ మంజూరు
ఎల్ఐసీ బీమా ప్లాన్ తీసుకున్న వారు పాలసీ పత్రాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అవసరమైన సందర్భాల్లో ఆ పాలసీ పత్రం ఎంతో సహాయపడుతుంది. ఎల్ఐసీ నుంచి అతి తక్కువ వడ్డీ రేటుకు (సుమారు 70పైసలు) రుణాన్ని పొందే చక్కని అవకాశం ఉంది.
అంతేకాదు క్లెయిమ్ చేయాలన్నా లేదా పాలసీని సరెండర్ చేయాలన్నా పాలసీ డాక్యుమెంట్ కీలకమవుతుంది. ఒకవేళ పాలసీ పత్రం కనిపించకుండా పోతే, లేదా ఎక్కడైనా ప్రయాణంలో పోగొట్టుకున్నా.. లేదా అగ్ని ప్రమాదాల కారణంగా నష్టపోయినా డూప్లికేట్ పాలసీ పత్రాన్ని ఎల్ఐసీ నుంచి తీసుకోవచ్చు.
పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ శాఖకు వెళ్లి డూప్లికేట్ పాలసీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో దరఖాస్తుకు అవకాశం లేదు. పాలసీ పత్రం పోయిందని, దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలంటూ పాలసీదారు ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికలో ప్రకటన ఇవ్వాలి. ఇందుకు అయ్యే వ్యయాన్ని పాలసీదారు భరించాలి. పత్రికా ప్రకటన కాపీని ఎల్ఐసీ కార్యాలయంలో ఇవ్వాలి.
ఒక నెల వరకు ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే అదే విషయాన్ని రికార్డుల్లో నమోదు చేసిన తర్వాత డూప్లికేట్ పాలసీ డాక్యుమెంట్ ను ఎల్ఐసీ జారీ చేస్తుంది. దీనికోసం ఇండెమ్నిటీ బాండ్, డూప్లికేట్ పాలసీ డాక్యుమెంట్ తయారీకి అయిన వ్యయం, స్టాంప్ ఫీజును ఎల్ఐసీ వసూలు చేస్తుంది.
పాలసీ సర్టిఫికెట్ చోరీ అయినా, అగ్ని ప్రమాదం కారణంగా కాలిపోయినా లేదా దెబ్బతిన్నా, ప్రభుత్వ కార్యాలయం కస్టడీలో ఉన్నప్పుడు నష్టపోయినా, చెదలు పట్టిన సందర్భాల్లో చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. దినపత్రికలో ప్రకటన అవసరం కూడా రాకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఫామ్ 3756 పత్రంలో ప్రశ్నలకు సమాధానాలు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. డూప్లికేట్ పాలసీ కోసం ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు వోటర్ ఐడీ, ఆధార్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.