COVID19: స్కూల్ ఐడీలతోనూ పిల్లలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్: కొవిన్ సీఈవో

Registrations For 15 to 18 Years Old Will Open From Jan 1st
  • జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లకు అవకాశం
  • ఇప్పటిదాకా 9 డాక్యుమెంట్లకు అనుమతి
  • తాజాగా స్కూల్ ఐడీనీ చేరుస్తామన్న ఆర్ఎస్ శర్మ
  • ప్రికాషనరీ డోసు కావాలంటే జబ్బులున్న వారు డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే
మరో వారంలో పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ మొదలు కానుంది. 15–18 ఏళ్ల మధ్య వారికి టీకాలు అందనున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టేసింది. జనవరి 1 నుంచి టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్టు కొవిన్ ప్లాట్ ఫాం సీఈవో డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఇవాళ తెలిపారు.

ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు లేని స్కూలు/కాలేజీ పిల్లలకు వారి వారి విద్యాసంస్థల ఐడీ కార్డులు, స్కూలు సర్టిఫికెట్లతోనూ కొవిన్ లో రిజిస్ట్రేషన్ కు అవకాశం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం కొవిన్ లో 9 ఐడీలతో రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తున్నామని, ఇప్పుడు స్కూల్ ఐడీలనూ వాటికి జత చేస్తామని తెలిపారు. 2007 లేదా అంతకుముందు పుట్టిన టీనేజర్లు వ్యాక్సిన్లకు అర్హులన్నారు.

ఇక ప్రికాషనరీ డోసుకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మెడికల్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మూడో డోస్ వేసిన వెంటనే క్యూఆర్ కోడ్ ద్వారా సర్టిఫికెట్ జనరేట్ అవుతుందన్నారు. ప్రికాషనరీ డోసుకు అర్హులైన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు సందేశాలు పంపుతామని ఆయన చెప్పారు. కాగా ప్రికాషనరీ డోసు కింద.. ఇంతకుముందు తీసుకున్న వ్యాక్సిన్లు కాకుండా వేరే వ్యాక్సిన్ వేసే విషయంపై తమకింకా క్లారిటీ రాలేదని ఆర్ఎస్ శర్మ చెప్పారు.
COVID19
Omicron
Vaccines
Cowin

More Telugu News