Jagga Reddy: ఈ పీసీసీ చీఫ్ మాకొద్దు: రేవంత్ పై సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ

Jagga Reddy asks Congress high command to remove Revanth Reddy as PCC chief
  • రేవంత్ పై ధ్వజమెత్తిన జగ్గారెడ్డి
  • అందరినీ కలుపుకుని పోయేవారిని చీఫ్ గా నియమించాలని విజ్ఞప్తి
  • లేకపోతే రేవంత్ ను నియంత్రించాలని వినతి
  • రేవంత్ తో వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టీకరణ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని మార్చాలంటూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖలు రాశారు. పార్టీలో అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరారు. లేదంటే పార్టీ మార్గదర్శనంలో నడిచేలా రేవంత్ ను నియంత్రించండి అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి పార్టీ వైఖరి కంటే సొంత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. స్టార్ లీడర్ గా ఎదగాలనుకుంటున్న రేవంత్ రెడ్డి తనకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటున్నారని, సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దించలేదని అన్నారు. తన వైఖరి మార్చుకోవాలని చెప్పేందుకు ఫోన్ చేస్తే రేవంత్ స్పందించడంలేదని ఆరోపించారు.

తెలంగాణలో పార్టీ నడుస్తున్న తీరు చూస్తుంటే సోనియా, రాహుల్ ల కాంగ్రెస్ పార్టీలా లేదని, ఓ కార్పొరేట్ ఆఫీసులా నడుస్తోందని విమర్శించారు. గ్రామస్థాయికి వెళ్లి పనిచేసే ఉద్దేశం రేవంత్ కు లేదని, ఇది పార్టీకి ప్రమాదం అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని జగ్గారెడ్డి వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడం కోసమే ఈ లేఖ రాస్తున్నానని  స్పష్టం చేశారు.
Jagga Reddy
Revanth Reddy
TPCC President
Sonia Gandhi
Rahul Gandhi
Congress
Telangana

More Telugu News