Omicron: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు
- తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
- నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒమిక్రాన్
- వారిని కలిసిన వారిలో ఇద్దరికి పాజిటివ్
- 55కి పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారు. వారిని కలిసిన వారిలో మరో ఇద్దరికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి పెరిగింది. వారిలో 10 మంది కోలుకున్నారు.
అటు, తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37,839 శాంపిల్స్ పరీక్షించగా, 182 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 181 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,73,404 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,417 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,023కి పెరిగింది.