Corona Virus: కరోనా తగ్గిందని సంబరం వద్దు.. ఏడు నెలలపాటు అది శరీరంలోనే మకాం!: తాజా పరిశోధనలో వెల్లడి

Coronavirus Can Persist for Months After Traversing Body

  • వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే ఏడు నెలలపాటు తిష్ట
  • మెదడు, గుండె, మూత్రపిండాలలో తిష్టవేసి పునరుత్పత్తి
  • శ్వాసకోశ వ్యవస్థలోనే అత్యధికంగా 97.70 శాతం వైరస్
  • కోలుకున్నాక కూడా నిద్రలేమి సమస్య

కొవిడ్-19కు కారణమయ్యే ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి ఆందోళన కలిగించే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి టక్కుటమార విద్యలన్నీ తెలుసని, ఇది ఒకసారి శరీరంలోకి ప్రవేశించిందంటే దీర్ఘకాలంపాటు తిష్ట వేస్తుందని తేలింది. శరీరంలోని ఏ అవయవాన్నీ అది వదిలిపెట్టదని, మూలమూలకు పాకిపోతోందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

మెదడు, గుండె సహా ఏ అవయవాన్నీ అది వదిలిపెట్టదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు, కరోనా నుంచి కోలుకుని నెగటివ్ వచ్చినంత మాత్రాన సంబరపడిపోవడం సరికాదని, అది దాదాపు ఏడు నెలలపాటు శరీరాన్ని అంటి పెట్టుకునే ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకుల తాజా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలామంది బాధితులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్టు, కొందరిలో నిద్రలేమి సమస్య ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు శనివారం ఆన్‌లైన్‌లో ఉంచారు.

కరోనా వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశించాక దాదాపు ఏడు నెలలపాటు, గరిష్ఠంగా 230 రోజులపాటు అది శరీరంలోనే తిష్టవేసి ప్రత్యుత్పత్తి సాగిస్తున్నట్టు తాము గమనించామని పరిశోధకులు గమనించారు. శరీరంలో అది దాదాపు అన్ని చోట్లకు పాకిపోయి ప్రత్యుత్పత్తి చేస్తున్నప్పటికీ ఊపిరితిత్తులు, ఇతర ప్రదేశాల్లో ఎలాంటి వాపులు కానీ, ఇబ్బందులు కానీ ఉండకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు.

కరోనాతో మృతి చెందిన 44 మంది మృతదేహాలను పరిశీలించిన పరిశోధకుల బృందం.. వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది ఇతర శరీర భాగాలకు ఎలా వ్యాపించిందన్న విషయాన్ని నిశితంగా పరిశీలించింది. నిజానికి కరోనా సోకిన తర్వాత బాధితుల శ్వాసకోశ వ్యవస్థలోనే అత్యధికంగా 97.70 శాతం వైరస్ ఉంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆ తర్వాత అది అక్కడి నుంచి పని ప్రారంభిస్తుందని, హృదయ కణజాలం, జీర్ణాశయం, లింఫోయిడ్, మూత్రపిండాలు, ఎండోక్రైన్ టిష్యూ, పునరుత్పత్తి కణజాలం, కండరాలు, చర్మం, నాడులు, మెదడు భాగాలకూ ఇది వ్యాప్తి చెందుతుందని తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన డేనియెల్ చెటావ్ తెలిపారు.

  • Loading...

More Telugu News