telangana: తెలంగాణలో విద్యుత్ చార్జీల బాదుడు.. యూనిట్ పై అదనంగా 50 పైసల భారం
- ఈఆర్సీ ఆమోదంతో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
- ఐదేళ్లుగా పెరగని చార్జీలు
- దీంతో ఈఆర్సీ ఆమోదం లాంఛనప్రాయమే
- నెలకు 200 యూనిట్ల వినియోగంపై రూ.100 భారం
తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత విద్యుత్ చార్జీలు పెరగబోతున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కమ్ లు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించిన అనంతరం ఆమోదం తెలియజేస్తుంది. ఇదంతా లాంఛనప్రాయమే.
ఈ క్రమంలో మరో మూడు నెలల్లో విద్యుత్ చార్జీలు పెరగడం ఖాయమేనని తెలుస్తోంది. ఇప్పటికే నిత్య జీవితంలో అన్ని రకాల వినియోగ ధరలు కొండెక్కుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇకమీదట విద్యుత్ వినియోగం కూడా భారం కానుంది.
దీని ప్రకారం, నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించే వారిపై అదనంగా రూ.100 మేరకు భారం పడుతుందని డిస్కం సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు మీడియాకు తెలిపారు. అంతకంటే ఎక్కువ వినియోగించే వారిపై భారం మరింత ఉంటుందని తెలుస్తోంది.
విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్ లు) విద్యుత్ కొనుగోళ్లకు అవుతున్న వ్యయాలు, పంపిణీ రూపంలో వస్తున్న ఆదాయం, ఇతర వ్యయాల వివరాలు, వీటితోపాటు ఎంతమేర చార్జీలు పెంచాలనుకుంటున్నదీ ఏటా ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈఆర్సీ ఆమోదంతో ఏప్రిల్ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయి.
ఇదిలావుంచితే, గత ఐదేళ్లుగా డిస్కమ్ లు చార్జీల సవరణ ప్రతిపాదనలను ఈఆర్సీకి ఇవ్వలేదు. దీంతో ఐదేళ్ల నుంచి అవే చార్జీలు కొనసాగుతున్నాయి. కానీ, డిస్కమ్ ల ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు. భారీ నష్టాలతో, అప్పులతో అవి నెట్టుకొస్తున్నాయి.
1 నుంచి 50 యూనిట్లలోపు వారికి యూనిట్ చార్జీ రూ.1.45 ఉండగా రూ.1.95కు పెరగనుంది. 51-100 యూనిట్ల వినియోగంపై యూనిట్ చార్జీ రూ.2.60 నుంచి 3.10కి పెరగనుంది. 100 యూనిట్లు దాటి 200 యూనిట్లలోపు వినియోగించే వారికి.. 1-100 యూనిట్ల వినియోగంపై యూనిట్ చార్జీ రూ.3.30 నుంచి 3.80కి పెరగనుంది. 101-200 యూనిట్ల మధ్య వినియోగిస్తే యూనిట్ చార్జీ రూ.4.30 నుంచి 4.80కు పెరగనుంది.
ఇక 201 యూనిట్లు, అంతకుమించి వినియోగించే వారికి.. 1-200 యూనిట్ల వరకు చార్జీ ఒక్కో యూనిట్ కు రూ.5 నుంచి 5.50కు పెరగనుంది. 201-300 యూనిట్ల మధ్య వినియోగం ఉంటే యూనిట్ చార్జీ రూ.7.20 నుంచి 7.70కు పెరగనుంది. 301-400 యూనిట్ల మధ్య యూనిట్ చార్జీ రూ.8.50 నుంచి 9.00కు పెరగనుంది. 401-800 యూనిట్ల మధ్య వినియోగిస్తే యూనిట్ చార్జీ రూ. 9.00 నుంచి 9.50గా అమలు కానుంది.