Kodali Nani: అలాంటప్పుడు కిరాణే షాపులే పెట్టుకోండి: హీరో నానికి మంత్రి కొడాలి నాని కౌంటర్
- థియేటర్ల కంటే కిరాణా షాపులకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయన్న హీరో నాని
- కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నప్పుడు అవే పెట్టుకోవచ్చుకదా అన్న కొడాలి నాని
- ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని విమర్శ
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ముదురుతోంది. టికెట్ ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం... థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తూ వాటిని సీజ్ చేస్తుండటంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఈ నేపథ్యంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. థియేటర్లకు వచ్చే కలెక్షన్ల కంటే కిరాణా షాపులకు వచ్చే కలెక్షన్లే ఎక్కువని నాని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పారు. దీంతో, ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. నానిపై మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా మంత్రి కొడాలి నాని కూడా తనదైన శైలిలో హీరో నాని వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నప్పుడు సినిమావాళ్లు తమ పెట్టుబడులతో కిరాణా కొట్లే పెట్టుకోవచ్చు కదా? అని కొడాలి నాని సెటైర్ వేశారు. సినిమా టికెట్ ధరలను తమ ప్రభుత్వం తగ్గించలేదని ఆయన అన్నారు. కొన్ని సినిమాలకు రేట్లు పెంచమని గతంలో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారని... అలాంటి పరిస్థితి ఉండకూడదనే తమ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారు. తాము టికెట్ ధరలను తగ్గించలేదని అన్నారు.
కోర్టుల అనుమతితో ప్రేక్షకులను సినీ పరిశ్రమలోని కొందరు అడ్డంగా దోచుకునేందుకు అవకాశం లేకుండా తాము చేశామని కొడాలి నాని చెప్పారు. టికెట్ ధరలు తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టమని అంటున్నారని... ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. మరోవైపు ఈరోజు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీ కానున్నారు.