Telangana: త్వరలోనే తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు!
- వచ్చేనెలలో సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం
- త్వరలో పూర్తికానున్న ఉద్యోగుల కేటాయింపులు, బదిలీ ప్రక్రియ
- అప్పుడే ఖాళీలపై లెక్క తేలుతుందంటున్న అధికారులు
తెలంగాణలో నోటిఫికేషన్లు రాక ఇప్పటిదాకా ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య హాట్ టాపిక్ గానూ మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్నా.. ఇప్పటిదాకా అది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు జోనల్ వ్యవస్థ ఏర్పాటు కూడా పూర్తి కావడంతో త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
68 వేల పోస్టులున్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అందులో ఎక్కువగా పోలీస్, విద్య, వైద్యారోగ్యశాఖలోనే ఉన్నట్టు తేల్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, అప్పుడు ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో లెక్క పక్కాగా తేలుతుందని అధికారులు అంటున్నారు. దీంతో అప్పుడే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముందంటున్నారు. దీనిపై జనవరి రెండో వారంలో సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు.