Perni Nani: బామ్మర్ది సినిమాకు మినహాయింపులు ఇచ్చారు.. అదే చిరంజీవి అడిగినా ఇవ్వలేదు: చంద్రబాబుపై పేర్ని నాని విమర్శలు
- జగన్ ప్రభుత్వానికి రాగద్వేషాలు ఉండవు
- థియేటర్లపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని అనడం సరికాదు
- 'ఆర్ఆర్ఆర్' నిర్మాత దానయ్య ఒకట్రెండు సార్లు ఫోన్లు చేశారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి ఎవరైనా ఒకటేనని మంత్రి పేర్ని నాని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా చట్టం, నిబంధనలకు లోబడి పని చేసుకుంటూ వెళ్తుందని చెప్పారు. సినిమా థియేటర్లపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించడం సరికాదని అన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.
పేర్ని నాని అనే వ్యక్తి మంచి సినిమా తీశాడని ప్రత్యేకంగా పన్ను మినహాయింపులు ఇవ్వబోమని తెలిపారు. చంద్రబాబు హయాంలో అలా ఉండేదని... ఆయన బామ్మర్ది సినిమాకు ఒక విధంగా, ఇతరుల సినిమాకు మరో విధంగా ఉండేదని చెప్పారు. వాళ్ల బామ్మర్ది తీసిన చారిత్రాత్మక చిత్రానికి పన్ను మినహాయింపులు ఇచ్చారని.. చిరంజీవి సినిమాకు అడిగినా మినహాయింపులు ఇవ్వలేదని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఇలాంటి రాగద్వేషాలు ఉండవని చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' నిర్మాత దానయ్య ఒకటి, రెండు సార్లు ఫోన్లు చేశారని... ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయనకు చెప్పామని పేర్ని నాని అన్నారు. అయితే ఈలోగానే ఒక కమిటీని వేశాం కాబట్టి... ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పేర్ని నానితో ఈరోజు సచివాలయంలో డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని పైవ్యాఖ్యలు చేశారు.