New Delhi: 'అమ్మాయిలు ఆ గీత ఎలా గీసుకోవాలో తెలుసుకోవాలి..' అంటూ జేఎన్‌యూ సర్క్యులర్.. విమర్శల వెల్లువ!

NCW chief asks JNU to withdraw misogynist circular
  • లైంగిక వేధింపులకు గురికాకుండా అమ్మాయిలకు సలహా ఇస్తూ సర్క్యులర్
  • స్త్రీ ద్వేషపూరిత సర్క్యులర్‌ అంటూ రేఖా శర్మ ఆగ్రహం
  • వెంటనే తొలగించాలని డిమాండ్
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు మండిపడుతుండగా, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. అమ్మాయిలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి ఎలా బయటపడవచ్చో సూచిస్తూ జారీ చేసిన ఆ సర్క్యులర్‌ను జేఎన్‌యూ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.

అబ్బాయిలు కొన్నిసార్లు అనుకోకుండా, ఇంకొన్ని సార్లు ఉద్దేశపూర్వకంగా స్నేహపూర్వక పరిహాసానికి, లైంగిక వేధింపులకు మధ్య ఉన్న సన్నని గీతను దాటుతారని, ఇలాంటి వేధింపులకు దూరంగా ఉండేందుకు అమ్మాయిలు తమకు, తమ మగ స్నేహితులకు మధ్య ఒక స్పష్టమైన గీతను ఎలా గీయాలో తెలుసుకోవాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.

ఈ సర్క్యులర్ తీవ్ర వివాదాస్పదమైంది. దీనిని స్త్రీ ద్వేషపూరిత సర్క్యులర్‌గా పేర్కొన్న రేఖా శర్మ వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి సలహాలన్నీ అమ్మాయిలకే ఎందుకు ఇస్తారు? ఇది వేధింపులకు పాల్పడే వారికి పాఠాలు నేర్పించే సమయం కానీ, బాధితులకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
New Delhi
JNU
NCW
Rekha Sharma

More Telugu News