Covid Cases: ఒమిక్రాన్ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దు: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక
- ఇంకా అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రిస్క్
- డెల్టాతో పోలిస్తే రెండు మూడు రోజుల్లోనే కేసుల రెట్టింపు
- దక్షిణాఫ్రికాలో 29 శాతం తగ్గినట్లు ప్రకటన
ఒమిక్రాన్ రిస్క్ చాలా అధిక స్థాయిలో ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రకటన చేసింది. చాలా దేశాల్లో కేసులు గణనీయంగా పెరగడానికి ఒమిక్రాన్ రకమే కారణమని పేర్కొంది. గత వారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 11 శాతం పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.
‘‘వరుసగా వెల్లడవుతున్న ఆధారాలను చూస్తుంటే డెల్టా కంటే అధికంగా వృద్ధి చెందే అనుకూలత ఒమిక్రాన్ వేరియంట్ కు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కేసులు రెట్టింపయ్యేంత వేగంగా ఇది వృద్ధి చెందుతోంది. బ్రిటన్, అమెరికా సహా చాలా దేశాల్లో కేసులు శరవేగంగా పెరగడం కనిపిస్తోంది’’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది.
కానీ, అదే సమయంలో దక్షిణాఫ్రికాలో కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అక్కడ కేసులు 29 శాతం తగ్గాయని పేర్కొంది. నవంబర్ 24న ఒమిక్రాన్ వెలుగు చూసింది ఇక్కడే కావడం గమనార్హం. బ్రిటన్, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ లో ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉందని డేటా తెలియజేస్తోంది.
కార్టికో స్టెరాయిడ్స్, ఇంటర్ లూకిన్ 6 రిసెప్టర్ బ్లాకర్లు కరోనా రోగుల చికిత్సలో ప్రభావవంతంగా పని చేయగలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ను న్యూట్రలైజ్ చేయడంలో మోనోక్లోనల్ యాంటీ బాడీల ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు తెలియజేసింది.