Omicron positive: తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల్లో సీరియస్ కేసులు ఏమీ లేవు.. మందుల్లేకుండానే కోలుకుంటున్నారు: వైద్యవర్గాల వెల్లడి
- ఊరిపితిత్తులపై ప్రభావం ఉండడం లేదు
- తలనొప్పి, ఒంటి నొప్పులు, జలుబు కనిపిస్తున్నాయి
- ప్యారాసిటమాల్ మాత్రలతోనే కోలుకుంటున్నారు
- 63 కేసుల్లో ఎక్కువ మంది టీకా తీసుకోలేదు
- వ్యాధి నివారణలో టీకాల పాత్ర ఉందని వెల్లడి
ఇప్పటి వరకు తెలంగాణలో వెలుగు చూసిన కరోనా ఒమిక్రాన్ కేసుల్లో ఏ ఒక్కటీ సీరియస్ పరిస్థితుల్లో లేదని రాష్ట్ర వైద్యాధికారులు స్పష్టం చేశారు. మందుల అవసరం లేకుండా వారు కోలుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం వరకు 63 ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో వెలుగు చూశాయన్నారు.
‘‘ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల్లో ఊపిరితిత్తులు ప్రభావానికి గురి కావడం (లంగ్స్ ఇన్ వాల్ మెంట్) లేదు. వీరిలో అధిక శాతం (46 మంది) కరోనా టీకాలు తీసుకోలేదు. 14 మంది ఒక్క డోసే తీసుకున్నారు. కనుక ఒమిక్రాన్ రకాన్ని నిరోధించడంలో ప్రస్తుతం ఇస్తున్న టీకాల పాత్ర ఉందని తెలుస్తోంది’’ అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్యారాసిటమాల్ మాత్రలతోనే రోగులు కోలుకుంటున్నట్లు చెప్పారు.
‘‘ఎక్కువ శాతం మంది మధ్య వయసు వారే ఉన్నారు. వారికి లక్షణాలు కూడా లేవు. 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి వెళ్లిపోయిన 10 మంది రోగులు సాధారణ వ్యక్తుల మాదిరే ఉన్నారు. వారి ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం లేదు. తలనొప్పి, ఒంటి నొప్పులు, దీనికితోడు జలుబు లక్షణాలే కనిపించాయి’’ అని ఆయన పేర్కొన్నారు.