Telangana: కరోనా టీకా ఒక్క డోసు వేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు: గవర్నర్ తమిళిసై
- రాష్ట్రంలో 100 శాతం ఫస్ట్ డోస్ పూర్తవడంపై సంతోషం
- చింతల్ బస్తీలోని అర్బన్ పీహెచ్ సీని సందర్శించిన గవర్నర్
- న్యూ ఇయర్ వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలని సూచన
కరోనా వ్యాక్సిన్ ఒక డోసు వేసుకున్నంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రజలంతా సమయానికి రెండో డోసు కూడా వేసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై కోరారు. రాష్ట్రంలో ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని చింతల్ బస్తీ అర్బన్ పీహెచ్ సీని ఆమె ఇవాళ సందర్శించారు. అక్కడ వైద్యాధికారులు.. వ్యాక్సినేషన్ తీరును గవర్నర్ కు వివరించారు.
రాష్ట్రంలో తొలి డోసు వంద శాతం పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. టీకా తీసుకోని వారిపైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలు తేల్చాయని, అందరూ వ్యాక్సిన్ కచ్చితంగా వేయించుకోవాలని ఆమె సూచించారు. టీకా వేసుకున్నా అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధనలను పాటించాలని, నూతన సంవత్సర వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని ఆమె కోరారు. ఆరోగ్యనామ సంవత్సరంగా 2022 నిలవాలని గవర్నర్ ఆకాంక్షించారు.