iits: ఆవిష్కరణల్లో మేటి ఐఐటీలు.. దేశంలోని టాప్-10 విద్యాసంస్థలు ఇవే!
- ఐఐటీ మద్రాస్ కు మొదటి ర్యాంకు
- ఐఐటీ హైదరాబాద్ కు ఏడో ర్యాంకు
- ఆవిష్కరణలు, స్టార్టప్ లకు ప్రోత్సాహం ఆధారంగా గుర్తింపు
ఆవిష్కరణలు, కొత్తగా కంపెనీలను స్థాపించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ఐఐటీలు ముందుంటున్నాయి. ఈ విషయంలో దేశంలోని అగ్రగామి 10 విద్యా సంస్థల వివరాలను ‘అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్ మెంట్స్’ తాజాగా విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ టాప్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఆరో ర్యాంకు సాధించింది. ఐఐటీ హైదరాబాద్ ఏడో ర్యాంకుని పొందింది. ఐఐటీ ఖరగ్ పూర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కేలికట్, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరప్రదేశ్ వరుసగా ర్యాంకులను సొంతం చేసుకున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన విద్యా సంస్థలకు ర్యాంకులు ఇచ్చే లక్ష్యంతో కేంద్ర విద్యా శాఖ తీసుకొచ్చిన కార్యక్రమమే ‘అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్ మెంట్స్’. విద్యార్థులు, అధ్యాపకుల నుంచి ఆవిష్కరణలు, స్మార్టప్ ల ఏర్పాటు, వ్యవస్థాపక సామర్థ్యం అంశాల ఆధారంగా ఏటా ర్యాంకులు కేటాయిస్తుంది. పేటెంట్ల దాఖలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.