cyberabad police: బిజినెస్ వీసాపై వచ్చి ‘యాప్’లతో మోసాలు.. విదేశీయులపై నిఘా పెట్టాలని ఆర్బీఐని కోరిన సైబరాబాద్ పోలీసులు
- చట్టవిరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు
- వారి లావాదేవీలపై నిఘా, పర్యవేక్షణ అవసరం
- పలు సూచనలు చేసిన పోలీసులు
బిజినెస్ వీసాపై దర్జాగా భారత్ కు విచ్చేసి.. యాప్ ల సాయంతో ఆర్థిక మోసాలు, నేరాలకు పాల్పడి తిరిగి స్వదేశానికి చెక్కేస్తున్నారు నేరగాళ్లు. అటువంటి వారిపై నిఘా వేయాలంటూ ఆర్బీఐని సైబరాబాద్ పోలీసులు కోరారు.
‘‘పలువురు విదేశీ పౌరులు బిజినెస్ వీసాపై వచ్చి భారత్ లో వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. చట్టవిరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కేంద్ర హోంశాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఇమ్మిగ్రేషన్ విభాగం సమన్వయంతో అటువంటి వ్యక్తులపై ఆర్బీఐ నిఘా, పర్యవేక్షణ ఉంచాలి. వారికి వస్తున్న నగదు జమలు, చెల్లింపుల లావాదేవీలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సాయంతో పరిశీలించాలి’’ అంటూ సైబరాబాద్ పోలీసులు ఆర్బీఐకి ఒక లేఖ రాశారు.
మోసపోయామంటూ బాధితులు ఇస్తున్న ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు ఎన్నో విషయాలను గుర్తించారు. దీంతో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఇన్ స్టంట్ లోన్ యాప్ లను కట్టడి చేయాలని ఆర్బీఐని కోరారు. కస్టమర్ల ఫోన్ లోని కాంటాక్టులు, లొకేషన్, గ్యాలరీ, ఫైల్స్ తదితర కీలక సమాచారాన్ని ఆ యాప్ లు పొందకుండా నిరోధించాలని సూచించారు.
ఇన్ స్టంట్ యాప్ ల ముసుగులో విదేశీ వ్యక్తులు చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి, వాటిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ అధికారులతో అంతకుముందు సమావేశం సందర్భంలోనూ సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు.
ప్రతీ ఎన్బీఎఫ్సీ సంస్థ తమ అధికారిక యాప్ ల సమాచారం ఆర్బీఐకి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. తదుపరి ఆయా కంపెనీలు, వాటికి సంబంధించిన యాప్ ల సమాచారాన్ని ఆర్బీఐ తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలని సూచించారు.