America: విమాన ప్రయాణం మధ్యలో కొవిడ్ నిర్ధారణ.. మూడు గంటలపాటు బాత్రూములో మగ్గిపోయిన మహిళ!
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
- ఐస్‌ల్యాండ్ వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన ఉపాధ్యాయురాలు
- గొంతు నొప్పిగా అనిపించడంతో కొవిడ్ స్వీయ పరీక్ష
- అంతకుముందు ఏడుసార్లు పరీక్షల్లో నెగటివ్‌గా తేలిన వైనం
విమాన ప్రయాణంలో ఉండగా గొంతు నొప్పి అనిపించడంతో ఓ మహిళ బాత్రూముకు వెళ్లి ర్యాపిడ్ టెస్టు చేసుకుంది. ఫలితం వైరస్ సోకినట్టుగా రావడంతో ఏం చేయాలో పాలుపోని ఆమె టాయిలెట్‌లోనే దాదాపు మూడు గంటలపాటు గడిపేసింది. గత నెల 19న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మిచిగన్‌కు చెందిన ఉపాధ్యాయురాలు మరిసా ఫొటియో ఐస్‌ల్యాండ్ వెళ్లేందుకు విమానం ఎక్కారు. విమానం టేకాఫ్ అయిన దాదాపు గంటన్నర తర్వాత గొంతులో నొప్పిగా అనిపించడంతో అనుమానించిన మరిసా వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లి కరోనా స్వీయ పరీక్ష (ర్యాపిడ్ టెస్ట్) చేసుకున్నారు. ఫలితం పాజిటివ్‌గా రావడంతో షాకయ్యారు. ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వెంటనే విమాన సిబ్బంది వద్దకు వెళ్లి విషయం చెప్పారు. ఏమీ కాదని చెప్పి వారు ఆమెను ఓదార్చారు.
అయితే, తన వల్ల విమానంలోని ఇతర ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఖాళీగా ఏదైనా సీటు ఉంటే మిగతా ప్రయాణికులకు దూరంగా అందులో కూర్చోవాలని మరిసా భావించారు. ఖాళీ సీటు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో టాయిలెట్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
అలా గమ్యాన్ని చేరుకునే వరకు ఆమె అందులోనే గడిపారు. తాను బూస్టర్ డోసు కూడా తీసుకున్నానని, ప్రయాణానికి ముందు రెండుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్టు, ఐదుసార్లు ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నానని, అన్నింటిలోనూ తనకు నెగటివ్ గానే వచ్చిందని మరిసా తెలిపారు.