TSRTC: టీఎస్ ఆర్టీసీ మరో బంపరాఫర్.. 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఎప్పటికీ ఉచిత ప్రయాణం!

TSRTC decided To free travel to children below 12 years

  • ఆక్యుపెన్సీని పెంచే యోచన
  • పండుగ వేళల్లో అదనపు చార్జీల వసూలుకు స్వస్తి
  • ఎంజీబీఎస్‌లో దివ్యాంగులు, వృద్ధుల కోసం ఉచిత బగ్గీ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 12 ఏళ్ల లోపు చిన్నారులకు నిన్న ఒక్క రోజు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన తెలంగాణ ఆర్టీసీ ఇకపై దానిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆక్యుపెన్సీని పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీని వల్ల తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని, ఫలితంగా సంస్థకు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌లో నిన్న నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, పండుగ రద్దీని తట్టుకునేందుకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీల వసూలుకు స్వస్తి పలికినట్టు చెప్పారు.

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా ఆర్టీసీ ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. ఇలాగే పనిచేస్తూ సంస్థకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ప్రధాన ద్వారం నుంచి ప్లాట్‌ఫామ్‌లకు చేరుకునేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడుతుండడంతో వారి కోసం ప్రత్యేకంగా ఉచిత బగ్గీని ఏర్పాటు చేసింది. బ్యాటరీతో నడిచే ఈ బగ్గీని సజ్జనార్ నిన్న ప్రారంభించారు. అంతకుముందు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని సజ్జనార్‌ సందర్శించారు. దీనిని సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలతో స్వయం పోషక సంస్థగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అన్ని రకాల వైద్య సేవలకు నిపుణులను నియమిస్తామని సజ్జనార్ తెలిపారు.

  • Loading...

More Telugu News