Cheteshwar Pujara: నీ ఫ్లాప్ షో అలాగే కొనసాగితే.. విశ్రాంతి తప్పదు: పుజారాపై శరణ్ దీప్ సింగ్ కామెంట్
- స్క్వాడ్ లో శ్రేయాస్ అయ్యర్ వేచి ఉన్నాడు
- పరుగులు రాబడితేనే స్థానం ఉంటుంది
- మన జట్టు సిరీస్ గెలుచుకుంటుంది
భారత జట్టు సెంచూరియన్ వేదికపై మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును చిత్తుగా ఓడించిన తర్వాత.. ఆటగాళ్ల ప్రదర్శనపై ఎన్నో ప్రశంసలు కురుస్తున్నాయి. కొందరు విమర్శించే వారూ ఉన్నారు. ఎందుకంటే భారత జట్టు గెలవడంలో ఓపెనర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తో పాటు బౌలర్లు షమి, బుమ్రా ప్రధాన పాత్రధారులుగా చెప్పుకోవాలి. మిగిలిన వారి నుంచి మెరుగైన ప్రదర్శన వెలుగు చూడలేదు. దీంతో చటేశ్వర్ పుజారా పదర్శన పట్ల మాజీ క్రికెటర్ శరణ్ దీప్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పుజారా మొదటి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు చేయకుండా అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 16 పరుగులు చేశాడు. చక్కని ఆటను ప్రదర్శించకపోతే త్వరలోనే విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందంటూ శరణ్ దీప్ సింగ్ హెచ్చరించారు. ‘‘మన బ్యాటింగ్ విభాగం అంత చక్కగా పనిచేయడం లేదు. కేఎల్ రాహుల్ ఒక్కడే కీలకంగా మారాడు. కానీ, అతడిపైనే పూర్తిగా, విరాట్ కోహ్లీ పైనా ఆధారపడలేము. ముఖ్యంగా పుజారా పరుగులు సాధించాలి. శ్రేయాస్ అయ్యర్ స్క్వాడ్ లో వేచి చూస్తున్నాడు. సీనియర్ ఆటగాడివైన నువ్వు ఫ్లాప్ షో (పేలవ ప్రదర్శన) కొనసాగిస్తే త్వరలోనే విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది’’అని శరణ్ దీప్ సింగ్ పేర్కొన్నారు.
‘‘భారత జట్టు మంచి పనితీరే చూపిస్తోంది. సిరీస్ ను మనమే గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది. దక్షిణాఫ్రికా జట్టు ఏదో ఆడాలని ఆడుతుందే తప్ప గెలుపు కోసం కాదు. వారి బ్యాటింగ్, బౌలింగ్ తీరు బలహీనంగా ఉంది. రెండో టెస్ట్ నుంచి క్వింటన్ డీ కాక్ జట్టులో భాగంగా ఉండడం లేదు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా దెబ్బతినబోతోంది. మన జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది’’ అని వివరించారు.