bjp: యూపీలో మళ్లీ బీజేపీదే విజయ పతాక.. రికార్డు సృష్టించనున్న యోగి: టైమ్స్ నౌ పోల్
- 249 స్థానాలు గెలుచుకుంటుంది
- ఎస్పీకి 152 వరకు రావచ్చు
- బీఎస్పీ14 స్థానాలకు పరిమితం
- టైమ్స్ నౌ ఓపీనియన్ పోల్
ఉత్తరప్రదేశ్ లో అతి త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. 403 స్థానాలకు గాను బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి 230 నుంచి 249 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 2017 ఎన్నికల్లో బీజేపీకి 325 స్థానాల్లో విజయం దక్కడం గమనించాలి.
బీజేపీ గెలిస్తే ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ 36 ఏళ్ల తర్వాత యూపీ చరిత్రలో రికార్డు సృష్టింబోతున్నారు. వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపడితే.. 1985 తర్వాత వరుసగా రెండు పర్యాయాలు సీఎం అయిన వ్యక్తిగా ఆయన పేరిట రికార్డు నమోదు కానుంది.
బీజేపీకి గట్టి పోటీనిస్తున్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి బాగానే పుంజుకోనుంది. ప్రస్తుత సభలో 48 స్థానాలుండగా.. 137 నుంచి 152 స్థానాల్లో విజయం సాధించొచ్చని టైమ్స్ నౌ పోల్ పేర్కొంది. మాయావతి ఆధర్యంలోని బీఎస్పీ మరింత బలహీనపడి పోనుంది. 9-14 స్థానాలతో సరిపెట్టుకుంటుందని ఈ సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో బీఎస్పీ 19 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ 4-7 స్థానాల వద్ద ఆగిపోతుందని అంచనా వేసింది.
బీజేపీ కూటమికి 38.6 శాతం ఓట్లు లభించనున్నాయి. ఎస్పీ కూటమికి 34.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా. బీఎస్పీ ఓటు బ్యాంకును ఈ రెండు కూటములు కొల్లగొట్టనున్నాయి. బీఎస్పీ ఓటు బ్యాంకు గతంలో 22.2 శాతంగా ఉండగా అది 14.1 శాతానికి క్షీణించనుంది.