Rashid Khan: తల్లిదండ్రులను కోల్పోయిన దు:ఖం ఇంకా పోకముందే.. రషీద్ ఖాన్ ఇంట్లో మరో తీవ్ర విషాదం

Rashid Khan Cousin Dies Afghan Cricketer Reveals With Pain
  • సోదరుడిని కోల్పోయిన ఆఫ్ఘన్ మిస్టరీ స్పిన్నర్
  • కజిన్ ను కోల్పోయానంటూ ట్విట్టర్ లో వెల్లడి
  • ఇటీవలే తండ్రికి భావోద్వేగమైన పోస్ట్
ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్, మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. 2018లో తండ్రిని పోగొట్టుకున్న రషీద్ ఎంతో కుంగిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లకే 2020లో తన తల్లిని కోల్పోయి మరింత దు:ఖంలో మునిగిపోయాడు. తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న అతడికి ఇప్పుడు మరింత విషాదం ఎదురైంది. తన సోదరుడు (కజిన్)ని కోల్పోయాడు. తన సోదరుడు హమీద్ ఖాన్ ఇక తమతో లేడు.. చనిపోయాడంటూ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించాడు. హమీద్ ఖాన్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

మూడో వర్ధంతి సందర్భంగా ఇటీవలే తన తండ్రిని గుర్తు చేసుకుంటూ రషీద్ ఖాన్ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టాడు. ‘‘నాన్నా.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయి మూడేళ్లవుతోంది. ఏదో ఒకరోజు అందరూ చనిపోతారని నాకు తెలుసు. అదే జీవితంలో చేదు నిజమైనా.. నీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నువ్వు శాశ్వతంగా వెళ్లిపోయావని ఆలోచించిన ప్రతిక్షణం కన్నీళ్లు ఉబికివస్తున్నాయి. మిస్ యూ నాన్న’’ అంటూ గుర్తు చేసుకున్నాడు. కాగా, ప్రస్తుతం రషీద్ ఖాన్ బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్నాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొన్నటిదాకా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు ఆడాడు.
Rashid Khan
Afghanistan
Cricket

More Telugu News