Superstar Krishna: ఎన్టీఆర్ ఆ సినిమా ఎప్పుడు తీస్తారోనని ఆసక్తిగా ఎదురుచూసేవాడ్ని: సూపర్ స్టార్ కృష్ణ
- అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలు
- ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో కార్యక్రమం
- సూపర్ స్టార్ కృష్ణకు ఘనసన్మానం
- హాజరైన మంత్రులు, సినీ ప్రముఖులు
మన్యం వీరుడు, తెల్లదొరలపై విప్లవశంఖం పూరించిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్, సీనియర్ నటుడు మోహన్ బాబు, నిర్మాత అశ్వినీదత్, సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ, తన జీవితంలో అల్లూరి సీతారామరాజు సినిమా నెంబర్ వన్ చిత్రం అని పేర్కొన్నారు. తాను కెరీర్ లో 350 చిత్రాల్లో నటించానని, అయితే అన్నింట్లోకి తనకు ఇష్టమైన సినిమా అల్లూరి సీతారామరాజు అని స్పష్టం చేశారు. అయితే, అప్పట్లో ఎన్టీఆర్ కూడా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీసేందుకు సిద్ధమయ్యారని, ఆయన ఆ చిత్రాన్ని ఎప్పుడు తీస్తారోనని ఆసక్తిగా ఎదురుచూసేవాడ్నని కృష్ణ వెల్లడించారు.
"అల్లూరి సీతారామరాజు చిత్రం నా కెరీర్ లో 100వ సినిమా. మా సొంత బ్యానర్ పై నేనే నిర్మించా. బుర్రకథల ద్వారా సీతారామరాజు జీవితం గురించి తెలుసుకున్నాను" అని వివరించారు.