West Bengal: బెంబేలెత్తిస్తున్న కరోనా కేసులు... రేపటి నుంచి బెంగాల్ లో విద్యాసంస్థల మూసివేత
- దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- అప్రమత్తమవుతున్న రాష్ట్రాలు
- తాజా మార్గదర్శకాలు జారీ చేసిన బెంగాల్
- రేపటి నుంచి అమలు
దేశంలో కరోనా రోజువారీ కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల కనిపించడంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధిస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. బెంగాల్ లో రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్ లు, స్పాలు మూసివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితో నిర్వహించనున్నారు. పరిపాలనా పరమైన భేటీలను వర్చువల్ విధానంలో చేపట్టాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
లోకల్ రైళ్లు 50 శాతం సీటింగ్ తో నడపాలని తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత లోకల్ రైళ్లు నిలిపివేయనున్నారు. అంతేకాదు, కోల్ కతా నుంచి ఢిల్లీ, ముంబయి నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు పరిమితం చేశారు. అది కూడా సోమ, మంగళ వారాల్లోనే విమాన సర్వీసులు నడపనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలకు నైట్ కర్ఫ్యూ విధించారు.
రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లు 50 శాతం సీటింగ్ తోనే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక సభలు సమావేశాలకు 200 మందికి లేదా, హాలులో సగం సీటింగ్ కు మాత్రమే అనుమతి ఇస్తారు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతి ఇవ్వరు.
కోల్ కతాలో గత మూడు రోజుల వ్యవధిలో కరోనా కేసులు మూడు రెట్లు పెరిగాయి. అటు బెంగాల్ లో కరోనా పాజిటివిటీ రేటు సైతం 5.47 శాతానికి పెరిగింది.