Telangana: 15-18 ఏళ్ల లోపు వారికి నేటి నుంచి టీకా.. వేసుకున్న తర్వాత అరగంటపాటు కేంద్రంలోనే!

Vaccination for teenagers in telangana starts today

  • పెద్దలకు ఇచ్చినట్టుగానే 0.5 మి.లీ. మోతాదులో టీకా
  • ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ లభ్యం
  • నాలుగు వారాల తర్వాత రెండో డోసు
  • రాష్ట్రంలో 22.78 లక్షల మందికిపైగా టీనేజర్లు

నేటి నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు మధ్యనున్న టీనేజర్లకు కరోనా టీకాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు పెద్దలకు ఇస్తున్నట్టుగానే వీరికి కూడా 0.5 మిల్లీ లీటర్ల మోతాదులో టీకా వేస్తారు. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత అంటే 28 రోజులకు రెండో డోసు వేస్తారు.

ఇక తమ రాష్ట్రంలో టీకాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ  ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు నిన్న మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాలు అందుబాటులో ఉంటాయని చెప్పినప్పటికీ ధర విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధి, 12 మునిసిపల్ కార్పొరేషన్లలో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే టీకాలు ఇవ్వనుండగా, జిల్లాల్లో మాత్రం నేరుగా టీకా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 22,78,683 మంది టీనేజర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు.

వైద్యుడి పర్యవేక్షణలోనే టీకా వేయనుండగా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే ఉండాలి. ఈ క్రమంలో ఏమైనా దుష్ప్రభావాలు తలెత్తితే కనుక వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ నెల 10 నుంచి వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మూడో డోసు ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News