Botsa Satyanarayana: అలా చెప్పడానికి చంద్రబాబు ఏమైనా చీఫ్ ఎన్నికల కమిషనరా?: బొత్స
- టీడీపీ, బీజేపీ కలిసి అధికారంలో ఉన్న నాలుగేళ్లు ఏం చేశాయి?
- సోము వీర్రాజు డిమాండ్ చీప్ ట్రిక్
- హైదరాబాద్లో జరిగింది కాపు సమావేశం కాదు.. ఫ్రెండ్స్ మీటింగ్ అంతే
ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పడానికి ఆయనేమైనా చీఫ్ ఎన్నికల కమిషనరా? అని ప్రశ్నించారు. లేదంటే బీజేపీకి సలహాదారుడా? అని ఫైరయ్యారు.
అలాగే, విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్), గుంటూరు జిన్నా టవర్ల పేర్లను మార్చాలంటున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సోము వీర్రాజుపైనా బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ కలిసి నాలుగేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు పేర్లు మార్చకుండా ఏం చేశాయని ప్రశ్నించారు.
అప్పుడు నోరెత్తకుండా ఇప్పుడు మార్చాలనడం దురుద్దేశపూరితమని అన్నారు. సోము వీర్రాజు డిమాండ్ చీప్ ట్రిక్ అని కొట్టిపడేశారు. హైదరాబాద్లో ఇటీవల జరిగింది కాపు సమావేశం కాదని, ఫ్రెండ్స్ మీటింగ్ మాత్రమేనని బొత్స చెప్పుకొచ్చారు.