Nandamuri Ramakrishna: ఇది మొత్తం తెలుగు జాతిని అవమానించినట్టే: నందమూరి రామకృష్ణ
- గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం
- విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించిన రామకృష్ణ
- వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఎన్టీఆర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
మరోవైపు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నందమూరి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజలు దేవుడిగా ఆరాధించే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమంటే... యావత్ తెలుగు జాతిని అవమానించినట్టేనని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకునే వైసీపీ నేతలు ఈ ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.