YS Sharmila: నాకున్న సమాచారం మేరకు సీఎం జగన్ ప్రధానితో బెయిల్ విషయం మాట్లాడతారు: రఘురామకృష్ణరాజు
- సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
- ప్రధాని మోదీతో సమావేశం
- వ్యంగ్యాస్త్రాలు సంధించిన రఘురామ
- 20 నిమిషాల భేటీని గంట అని చెప్పుకుంటారని ఎద్దేవా
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. తనకు లభించిన సమాచారం మేరకు జగన్ తన బెయిల్ విషయం ప్రధానితో మాట్లాడతారని వెల్లడించారు.
ప్రధానితో తన బెయిల్ పై మాట్లాడుకుని, ఆపై బయటికి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు అంశాలపై చర్చించామని చెప్పుకుంటారని రఘురామ పేర్కొన్నారు. ప్రధానితో 20 నిమిషాల సమావేశం జరిగితే, బయట వేచి ఉన్న సమయంతో కలిపి గంట సేపు భేటీ అయ్యామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. చర్చలు విజయవంతం అని కూడా ప్రకటించుకుంటారని అన్నారు.
ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు సినిమా టికెట్ల అంశంలోనూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. "సినిమా టికెట్ల ధరలు తగ్గించాలని పేదవాళ్లు అడిగారా? పేదలపై అంత శ్రద్ధ ఉండే నిత్యావసరాల ధరలు తగ్గించు, పెట్రోల్ ధరలు తగ్గించు. చేతనైతే వీటి ధరలు నియంత్రించు. అసలు సెక్రటేరియట్ కు వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నవాళ్లు ముఖ్యమంత్రి ఏంటండీ... జనం నవ్వుతున్నారు. సినిమా బాగుంటేనే చూస్తారు తప్ప, టికెట్ రేట్లు తగ్గించినంత మాత్రాన చూస్తారా?" అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.