Somu Veerraju: ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు సోము వీర్రాజు కౌంటర్

Somu Veerraju strong reply to Vijayasai Reddy comments
  • జిన్నా టవర్, కేజీహెచ్ ల పేర్లు మార్చాలన్న సోము వీర్రాజు
  • బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలన్న విజయసాయిరెడ్డి
  • మీరా మాకు నీతులు చెప్పేది? అంటూ సోము ఆగ్రహం
  • తాము అధికారంలోకి వచ్చాక పేర్లు మార్చుతామని వ్యాఖ్య 
"గుంటూరు జిన్నా టవర్, విశాఖ కేజీహెచ్ పేర్లు మార్చాలంటున్న ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలు" అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించడం తెలిసిందే. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు.

రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉండే మీవంటి వారితో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో ఏపీ బీజేపీ లేదని బదులిచ్చారు. నిత్యం ల్యాండ్, శాండ్, వైన్ ద్వారా పేద ప్రజల కష్టాన్ని పీక్కుతినే రాబందుల వంటి మీరా మాకు హితబోధ చేసేది? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. విశాఖ భూములపై కన్నేసి మూడు రాజధానులంటూ కుట్రలకు తెరదీసిన మీ నీతులు మాకు అవసరంలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేదీ, అమరావతిని నిర్మించేదీ, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేదీ, ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చేదీ, రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తున్నదీ నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని సోము వీర్రాజు ఉద్ఘాటించారు. దేశ ద్రోహుల పేర్లు మీరు మార్చకపోతే, ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా వాటి పేర్లు మార్చుతుందని స్పష్టం చేశారు.
Somu Veerraju
Vijay Sai Reddy
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News