Sunil Gavaskar: వీళ్లిద్దరూ తమ కెరీర్ లను కాపాడుకోవడానికి మరొక్క ఇన్నింగ్సే మిగిలుంది: గవాస్కర్
- జోహాన్నెస్ బర్గ్ లో రెండో టెస్టు
- దారుణంగా విఫలమైన పుజారా, రహానే
- 33 బంతులాడి 3 పరుగులు చేసిన పుజారా
- డకౌట్ అయిన రహానే
- ఈసారి విఫలమైతే జట్టులో స్థానం కష్టమేనన్న గవాస్కర్
టీమిండియాలో ఇటీవల తరచుగా విఫలమవుతున్న ఆటగాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఛటేశ్వర్ పుజారా, మరొకరు అజింక్యా రహానే. గతంలో అనేక విజయాల్లో కీలకభూమిక పోషించిన ఈ సీనియర్ ఆటగాళ్లు ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వీళ్లిద్దరినీ సెలెక్టర్లు పక్కనబెడతారని వార్తలు వచ్చినా, చివరి అవకాశంగా మరోసారి జట్టుకు ఎంపిక చేశారు.
అయితే, రెండో టెస్టులో విరాట్ కోహ్లీ గైర్హాజరులో జట్టు కోసం బాధ్యతగా ఆడాల్సిన వీరిద్దరూ దారుణ ప్రదర్శన కనబర్చారు. పుజారా అతికష్టమ్మీద 33 బంతులాడి 3 పరుగులు చేయగా, రహానే డకౌట్ అయ్యాడు. వీళ్లిద్దరి తాజా వైఫల్యంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.
పుజారా, రహానేలకు అవకాశాలు దాదాపు పూర్తయ్యాయని, వీళ్లు తమ కెరీర్ లను కాపాడుకోవాలనుకుంటే అందుకు మరొక్క ఇన్నింగ్స్ మాత్రమే మిగిలుందని స్పష్టం చేశారు. రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో వీరు రాణించకపోతే ముగింపు తప్పదన్న రీతిలో వ్యాఖ్యానించారు.
అసలు ఈ ద్వయం అదేపనిగా విఫలమవుతున్నప్పటికీ తుది జట్టులో ఎలా స్థానం లభిస్తోందన్న దానిపై సందేహాలు తలెత్తుతున్నాయని గవాస్కర్ అన్నారు. శ్రేయాస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నారని, వారిని కాదని తాము జట్టులో స్థానానికి ఎలా అర్హులమో చాటిచెప్పేందుకు సెకండ్ ఇన్నింగ్సే వీరికి ఆఖరు అవకాశం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.
2019 నుంచి పుజారా ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోగా, రహానే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏడాదికాలంగా రహానే ఆట మరింత క్షీణించింది.