Team India: సఫారీ పేసర్ల వికెట్ల వేట... తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 202 ఆలౌట్
- జోహాన్నెస్ బర్గ్ లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
- పేసర్లకు సహకరిస్తున్న వాండరర్స్ పిచ్
- 4 వికెట్లు తీసిన మార్కో జాన్సెన్
- మూడేసి వికెట్లు పడగొట్టిన రబాడా, ఒలీవియర్
రెండో టెస్టుకు వేదికగా నిలుస్తున్న జోహాన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ పిచ్ పేసర్లకు విశేషంగా సహకరిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా పేసర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. 21 ఏళ్ల యువ లెఫ్టార్మ్ పేసర్ మార్కో జాన్సెన్ 4 వికెట్లు సాధించగా, కగిసో రబాడా 3, డువానే ఒలీవియర్ 3 వికెట్లు తీశారు.
టీమిండియా బ్యాటింగ్ చూస్తే... తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 50 పరుగులు నమోదు చేశాడు. లోయరార్డర్ లో రవిచంద్రన్ అశ్విన్ 46 పరుగులు చేయకుంటే భారత జట్టు ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26, హనుమ విహారి 20, పంత్ 17 పరుగులు చేశారు.