Reham Khan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మాజీ భార్య వ్యంగ్యాస్త్రాలు
- పెళ్లికి వెళ్లి వస్తుండగా రెహామ్ కారుపై కాల్పులు
- ఆ సమయంలో మరో కారులో ఉన్న రెహామ్
- ఇదేనా కొత్త పాకిస్థాన్? అంటూ ఎద్దేవా
- తాను కూడా పాకిస్థానీనే అని ఉద్ఘాటన
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు కొత్త కాదు. అయితే ఈసారి ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ ఏకంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన బంధువు ఇంట వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా తన కారుపై కాల్పులు జరిగాయని రెహామ్ ఖాన్ ఆరోపించారు. అయితే ఆ సమయంలో తాను మరో వాహనంలో ఉన్నానని, తన కారులో డ్రైవర్, పీఏ ఉన్నారని ఆమె వెల్లడించారు. బైక్ పై వచ్చిన దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారని తెలిపారు.
"ఇదేనా ఇమ్రాన్ ఖాన్ ప్రవచిస్తున్న కొత్త పాకిస్థాన్?" అంటూ ఆమె వ్యంగ్యం ప్రదర్శించారు. "పిరికివాళ్లు, దుర్మార్గులు, స్వార్థపరుల రాజ్యానికి స్వాగతం" అంటూ ఎద్దేవా చేశారు. "ఓ సగటు పౌరురాలిగా పాకిస్థాన్ లోనే జీవించాలని, పాకిస్థాన్ లోనే చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. జాతీయ రహదారిపై పిరికిపందలా నన్ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ పేరుగొప్ప ప్రభుత్వమే ఈ దాడికి బాధ్యత వహించాలి. నా మాతృదేశం కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే" అని రెహామ్ ఖాన్ ఆవేశపూరితమైన ట్వీట్ చేశారు.
కాగా, ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాపీ అందజేయలేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. రాత్రంతా తమకు నిద్రలేదని, ఓ కేసు నమోదు చేసుకోవడానికి ఎంత జాప్యం జరుగుతోందో చూడండి అంటూ అసంతృప్తి వెలిబుచ్చారు. తనకేమైనా ఫర్వాలేదని, కానీ తన సిబ్బంది క్షేమం గురించే తన ఆందోళన, ఆగ్రహం అని రెహామ్ ఖాన్ స్పష్టం చేశారు.
రెహామ్ ఖాన్ కు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఆమె ఓ పాత్రికేయురాలిగా, రచయితగా, ఫిలింమేకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ తో రెహామ్ వివాహం 2015లో జరిగింది. అదే ఏడాది వీరిద్దరూ విడిపోయారు.