Ajinkya Rahane: ఆడింది చాలుగానీ.. ఇక దయచేయండి.. రహానే, పుజారాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నెటిజన్లు
- గత రెండేళ్లుగా దారుణమైన ఫామ్‌తో తంటాలు పడుతున్న రహానే, పుజారా
- విమర్శలు వెల్లువెత్తుతున్నా జట్టులో చోటిస్తున్న సెలక్టర్లు
- ఇకపై టెస్టుల్లో వీరిద్దరూ కనిపించకూడదని అభిమానుల ఆగ్రహం
- శ్రేయాస్ అయ్యర్‌కు చోటివ్వాలని డిమాండ్
చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే.. టీమిండియా సీనియర్ ఆటగాళ్లయిన వీరిద్దరి పేర్లు ఇటీవల తరచూ మీడియాకెక్కుతున్నాయి. గత రెండేళ్లుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటంటే ఒక్కటీ లేనప్పటికీ జట్టులో మాత్రం చోటు దక్కించుకుంటున్నారు. వీరి ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా బీసీసీఐ మాత్రం వీరికి చోటిస్తూనే ఉంది. తాజాగా, దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో పుజారా, రహానే మరోమారు దారుణంగా విఫలమై అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.
పుజారా మూడు పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా, రహానే ఆడిన తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇంకేముందీ.. ఇప్పటికే వీరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అభిమానులు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఆడింది చాలుగానీ తప్పుకుని కొత్త కుర్రాళ్లకు చోటివ్వాలని కోరుతున్నారు. ఏదో ఒక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి ఆ తర్వాత నాలుగైదు టెస్టుల్లో చోటు దక్కించుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా, రహానే, పుజారా ఇద్దరూ గత రెండేళ్లుగా దారుణమైన ఫామ్‌తో ఉన్నారు. 2020, 2021లో పుజారా సగటు వరుసగా 20.37, 30.42 మాత్రమే అంటే అతడి బ్యాటింగ్ తీరు ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రహానే విషయానికి వస్తే పైన చెప్పుకున్న సంవత్సరాల్లో అతడి సగటు వరుసగా 38.85, 19.57గా ఉంది. అక్టోబరు 2019లో సెంచరీ తర్వాత రహానే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క శతకం కూడా నమోదు చేయలేదు. పుజారా అయితే మరింత దారుణం. జనవరి 2019 తర్వాత అతడి ఖాతాలో ఒక్క సెంచరీ కూడా జమ కాలేదు.
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నా జట్టులో వీరికి చోటు కల్పిస్తుండడంపై అభిమానులు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. వీరిద్దరికీ ఇంకెన్ని చాన్స్‌లు ఇస్తారని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరినీ తప్పించి కొత్త కుర్రాళ్లకు చోటిచ్చే సమయం వచ్చేసిందని అంటున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ అయితే తర్వాతి టెస్టుల్లో వీరిద్దరూ కనిపించకూడదని, శ్రేయాస్ అయ్యర్‌కు తక్షణమే జట్టులో చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని జట్టు నుంచి తప్పించి రంజీలు ఆడించాలని కోరుతున్నారు.