bharat biotech: బూస్టర్ డోస్ గా ముక్కు ద్వారా ఇచ్చే భారత్ బయోటెక్ టీకా..?
- రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇది ఇవ్వొచ్చు
- అనుమతి కోసం భారత్ బయోటెక్ దరఖాస్తు
- నేడు తేల్చనున్న నిపుణుల కమిటీ
అందరికీ సౌకర్యంగా ఉండే నాసికా టీకా రాబోతోంది. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా ‘ఇంట్రానాసల్ వ్యాక్సిన్ బీబీవీ154’ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లోనూ సత్ఫలితాలు వెలుగు చూశాయి. దీంతో బూస్టర్ డోసు లేదా మూడో డోసుగా దీనిని అనుమతించాలంటూ భారత్ బయోటెక్ దరఖాస్తు పెట్టుకుంది.
ఇప్పటికే మొదటి రెండు డోసులుగా కొవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ తీసుకున్న వారికి నాసికా టీకా ఇవ్వొచ్చని ఆ సంస్థ చెబుతోంది. దీంతో కేంద్ర ఔషధ నియంత్రణ మండలి పరిధిలోని సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) నేడు భేటీ కానుంది. భారత్ బయోటెక్ సమర్పించిన ప్రాథమిక అధ్యయన పత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాత తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది.
అనుమతి లభించిన తర్వాత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ సంస్థ 5,000 మంది వలంటీర్లపై నిర్వహించనుంది. 2,500 మంది చొప్పున రెండు గ్రూపులుగా తీసుకుంటుంది. వీరిలో రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకున్న వారిని ఒక గ్రూపుగాను, రెండు డోసుల కోవిషీల్డ్ తీసుకున్న వారిని మరో గ్రూపుగానూ విభజిస్తారు.