Somu Veerraju: ఈ లోన్ వ్యవహారంతో నా తండ్రికి ఎటువంటి సంబంధం లేదు: సోము వీర్రాజు కుమార్తె
- చీటింగ్, ఫోర్జరీ కేసులో సోము వీర్రాజు అల్లుడిపై కేసు నమోదు
- నాన్న ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- తన వివాహం తర్వాత అసలు తన తండ్రి తమ ఇంటికే రాలేదన్న సూర్యకుమారి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహంపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదయింది. నరసింహంపై రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్బీఐ బ్యాంకులో ఆయన లోన్ తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు కుమార్తె సూర్యకుమారి స్పందించారు. ఈ లోన్ వ్యవహారంతో తన తండ్రికి ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి ఇంటికి, తమకు ఎలాంటి సంబంధాలు, రాకపోకలు లేవని చెప్పారు. తన వివాహం తర్వాత ఆయన ఇప్పటి వరకు తమ ఇంటికి రాలేదని అన్నారు.
బిజినెస్ లావాదేవీల్లో భాగంగానే తాము లోన్ తీసుకున్నామని చెప్పారు. కావాలనే తమపై కేసు పెట్టారని... ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు. డబ్బు లావాదేవీలకు సంబంధించి నిన్న మధ్యవర్తుల సమక్షంలో రాజమండ్రిలో చర్చలు జరిగాయని చెప్పారు. తన తండ్రి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, దీనితో ఆయనకు సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక పోలీసులు ఇంతవరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.