Sero Survey: తెలంగాణలో ఎంత మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయి? అన్న విషయంపై నేటి నుంచి సీరో సర్వే
- 33 జిల్లాల పరిధిలో నిర్వహణ
- ప్రతి జిల్లాలో 10 గ్రామాల ఎంపిక
- 40 మంది వ్యక్తులు, ఆరోగ్య సిబ్బంది నుంచి నమూనాలు
- కొవిడ్ యాంటీబాడీల గుర్తింపు
తెలంగాణలోని 33 జిల్లాల పరిధిలో సీరో సర్వే మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొవిడ్ 19 సీరో ప్రివలెన్స్ సర్వేను చేపడుతున్నాయి. సాధారణ ప్రజలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది నుంచి ర్యాండమ్ గా రక్త నమూనాలను సేకరించి పరీక్షంచనున్నారు.
తీసుకున్న రక్త నమూనాల్లో సార్స్ కోవ్-2 ఐజీజీ యాంటీబాడీలను గుర్తించనున్నట్టు ఎన్ఐఎన్ తెలిపింది. ఎన్ఐఎన్ ఈ సర్వేను నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమానికి వైద్య, ఇతర శాఖలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. మొత్తం 330 గ్రామాల్లో ఇంటింటి సర్వే జరుగుతుంది. ఫలితాల ఆధారంగా మొత్తం జనాభాలో ఎంత మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయనే అంచనాకు వస్తారు.
‘‘ప్రతి జిల్లాలో ర్యాండమ్ గా 10 గ్రామాలను ఎంపిక చేస్తాం. ప్రతి గ్రామంలో 40 మంది నుంచి రక్త నమూనాలు సేకరిస్తాం. వీరికి అదనంగా ఆరోగ్య సిబ్బంది అందరి నుంచి రక్త నమూనాలు తీసుకుంటాం’’ అని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ విభాగం హెడ్ ఆవుల లక్ష్మయ్య తెలిపారు.