RRR: సరైన సమయం కోసం చూస్తున్నాం సర్!: మాధవన్ కు బదులిచ్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
- జనవరి 7న విడుదలవ్వాల్సిన ఆర్ఆర్ఆర్
- దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి
- ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా
- రికార్డులు బద్దలవడం ఖాయమన్న మాధవన్
- తారక్, చరణ్ ల సాన్నిహిత్యం ఈర్ష్య కలిగిస్తోందని వ్యాఖ్యలు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం పరిస్థితులు బాగుంటే ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండడం, అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తుండడంతో విడుదల వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మాధవన్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ లో 'నాటు నాటు' పాట ఉర్రూతలూగిస్తోందని, అద్భుతమైన పాట అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య సాన్నిహిత్యం అసూయ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. "ఏమైనా వాళ్లిద్దరిని చూస్తుంటే గర్వంగా ఉంది... హేట్సాఫ్!" అంటూ ట్వీట్ చేశారు. అందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ "థాంక్యూ మ్యాడీ సర్!" అంటూ మాధవన్ కు బదులిచ్చింది.
ఆపై మాధవన్ మరో ట్వీట్ చేశారు. "మీరు అన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం... భారతీయ సినీ చరిత్రలో గత చిత్రాల కలెక్షన్లను తిరగరాస్తారు" అంటూ వ్యాఖ్యానించారు. అందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ బదులిస్తూ... "మేం కూడా అందుకు సిద్ధంగా ఉన్నాం సర్. ప్రభంజనం సృష్టించేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే దేశంలో థియేటర్లన్నీ మామూలుగా నడిచే రోజు వస్తుందని ఆశిస్తున్నాం" అని పేర్కొంది.