Shardul Thakur: మూడు వికెట్లతో శార్దూల్ ఠాకూర్ విజృంభణ... కష్టాల్లో దక్షిణాఫ్రికా
- వాండరర్స్ లో రేసులో కొచ్చిన టీమిండియా
- నేడు ఆటకు రెండోరోజు
- ఓవర్ నైట్ స్కోరు 35-1తో ఇన్నింగ్స్ షురూ చేసిన సఫారీలు
- 14 పరుగుల తేడాతో 3 వికెట్లు పడగొట్టిన ఠాకూర్
- లంచ్ విరామానికి దక్షిణాఫ్రికా స్కోరు 102-4
జోహాన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా మళ్లీ రేసులోకి వచ్చింది. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి 4 వికెట్లకు 102 పరుగులు చేసింది. తొలి రోజు ఆటలో ఒక్క వికెట్టే కోల్పోయిన సఫారీలు... నేడు రెండో రోజు ఆటను ఉత్సాహంగా ఆరంభించారు. 88 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా కెప్టెన్ డీన్ ఎల్గార్ (28), కీగాన్ పీటర్సన్ (62) స్కోరుబోర్డును నడిపించారు.
అయితే, అక్కడి నుంచి శార్దూల్ ఠాకూర్ విజృంభణ మొదలైంది. కేవలం 14 పరుగుల తేడాతో 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బకొట్టాడు. కెప్టెన్ ఎల్గార్ తో పాటు అర్ధసెంచరీ హీరో పీటర్సన్, వాన్ డర్ డుస్సెన్ (1)లను అద్భుతమైన బంతులతో పెవిలియన్ చేర్చాడు.
వాన్ డర్ డుస్సెన్ వికెట్ పడిన అనంతరం అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. ప్రస్తుతం క్రీజులో టెంబా బవుమా ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 100 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.