Preet Chand: ఒంటరిగా దక్షిణ ధ్రువానికి... చరిత్ర సృష్టించిన భారత సంతతి బ్రిటీష్ మహిళ

British Sikh woman army officer Preet Chandi arrives South Pole

  • బ్రిటీష్ సైన్యంలో ఫిజియోథెరపిస్ట్ గా ప్రీత్ చాందీ
  • గత నవంబరులో సాహసయాత్ర ప్రారంభం
  • 40 రోజుల్లో 700 మైళ్ల ప్రయాణం
  • అత్యంత క్లిష్టమైన పరిస్థితులను అధిగమించిన చాందీ

భారత సంతతి బ్రిటీష్  సిక్కు మహిళ ప్రీత్ చాందీ చరిత్ర సృష్టించింది. ఆమె బ్రిటన్ సైన్యంలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తోంది. ఆమె ఒంటరిగా 700 మైళ్లు ప్రయాణించి దక్షిణ ధ్రువానికి చేరుకుంది. ఇంతటి బృహత్తర యాత్రను ఒంటరిగా పూర్తిచేసిన తొలి మహిళ ప్రీత్ చాందీ కావడం విశేషం.

గతేడాది నవంబరులో చాందీ సాహసయాత్ర ప్రారంభమైంది. చలి గడ్డకట్టించే మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ధ్రువప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణం ఎంతో ప్రమాదకరం. అక్కడ ప్రకృతే ప్రథమ శత్రువు. అయినప్పటికీ వెరవకుండా, ప్రీత్ చాందీ అంటార్కిటికాలోని హెర్క్యులెస్ ఇన్లెట్ నుంచి యాత్ర మొదలుపెట్టింది. కొంతదూరం స్కీయింగ్ చేస్తూ, కొంతదూరం నడుస్తూ 40 రోజుల్లో 1,126 కిలోమీటర్లు ప్రయాణించింది. జనవరి 3న తాను దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నట్టు ఆమె ప్రకటించింది. ప్రీత్ చాందీ వయసు కేవలం 32 ఏళ్లే.

దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తర్వాత భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరయ్యానని ఆమె తన బ్లాగ్ లో వెల్లడించింది. ఎట్టకేలకు తాను ధ్రువప్రాంతానికి చేరుకున్నానంటే నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించింది.

భూమిపై అత్యంత చల్లని, ఎత్తయిన, విపరీతమైన గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. ఇక్కడ జీవుల మనుగడ అత్యంత క్లిష్టమైనది. యాత్ర మొదలుపెట్టినప్పుడు ఈ ఖండం గురించి తనకు పెద్దగా తెలియదని చాందీ వెల్లడించింది. అయితే, ఇలాంటి యాత్రల కోసం రెండున్నరేళ్ల పాటు శిక్షణ పొందానని తెలిపింది. ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాల్లోనూ, ఐస్ లాండ్ లోనూ సాధన చేసింది.

కాగా, అంటార్కిటికా యాత్ర సందర్భంగా ఆమె తన వెంట 90 కేజీల బరువున్న ఓ స్లెడ్జి, తన కిట్, ఇంధనం, ఆహారం తీసుకువెళ్లింది. మహిళా సైనికాధికారి ప్రీత్ చాందీ ఘనత పట్ల బ్రిటీష్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అభినందించారు.

  • Loading...

More Telugu News