JP Nadda: నా ప్రజాసామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు... గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తా: జేపీ నడ్డా
- ర్యాలీకి పిలుపునిచ్చిన తెలంగాణ బీజేపీ
- అనుమతి లేదంటున్న పోలీసులు
- జేపీ నడ్డాను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కలిసిన జాయింట్ సీపీ
- నడ్డాకు నోటీసులు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ, బీజేపీ శ్రేణులు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ తలపెట్టాయి. ఈ ర్యాలీలో పాల్గొనాలని నడ్డా భావించారు. అయితే ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే, పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
దీనిపై నడ్డా స్పందిస్తూ, తనను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారని వివరించారు. అయితే తాము కరోనా నిబంధనలు పాటిస్తామని స్పష్టం చేశారు. తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో, కాసేపట్లో నడ్డా సికింద్రాబాద్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.