JP Nadda: ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ కు మతిభ్రమించినట్టుంది: జేపీ నడ్డా ఫైర్
- ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన నడ్డా
- అనుమతి లేదన్న పోలీసులు
- పార్టీ కార్యాలయంలో నడ్డా ప్రెస్ మీట్
- తెలంగాణ సర్కారుపై విమర్శలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జేపీ నడ్డాను కలిసిన పోలీసులు, ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జీవో 317 తీసుకువచ్చారని, ఆ జీవోకి వ్యతిరేకంగా బండి సంజయ్ శాంతియుతంగా నిరసన తెలిపారని వెల్లడించారు. అయితే పోలీసులు దురుసుగా వ్యవహరించి, బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేశారని జేపీ నడ్డా ఆరోపించారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటముల తర్వాత కేసీఆర్ కు మతిభ్రమించినట్టుందని విమర్శించారు. అవివేకంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయం అయిందని, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.