Molnupiravir: కొవిడ్ ట్యాబ్లెట్స్ వచ్చేశాయి.. ఐదు రోజుల కోర్సు రూ. 1,399 మాత్రమే

Molnupiravir antiviral drug to treat Covid rolled out in India

  • ‘మోలు లైఫ్ (200 ఎంజీ’) పేరుతో మాత్రలు విడుదల చేసిన మ్యాన్‌కైండ్ ఫార్మా
  • ఒక్కో డోసుకు 800 ఎంజీ
  • మొత్తం 13 సంస్థలకు ఉత్పత్తి అధికారం
  • ఒక్కో సంస్థది ఒక్కో ధర

కరోనా వైరస్ మళ్లీ భయపెడుతున్న వేళ ప్రజలకు ఇది కొంత ఊరటనిచ్చే వార్తే. ఇకపై దగ్గు, జలుబు, జ్వరానికి కొనుక్కుంటున్నట్టుగానే మెడికల్ షాపులో కొవిడ్ మాత్రలను కొనుగోలు చేసుకోవచ్చు. అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ అభివృద్ధి చేసిన మోల్నుపిరవిర్ మాత్రలు ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి.

‘మోలు లైఫ్ (200 ఎంజీ)’ పేరుతో వచ్చిన ఈ ట్యాబ్లెట్లను మన దేశంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ విడుదల చేసింది. ఈ మాత్రలను ఐదు రోజుల కోర్సుగా వాడాల్సి ఉంటుంది. ధర రూ. 1,399 మాత్రమే. ఒక్కో డబ్బాలో 40 మాత్రలు ఉంటాయి. ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు చొప్పున వేసుకోవాలి. అంటే పూటకు 800 ఎంజీ డోసు అన్నమాట. అయితే, వీటిని వైద్యుల సిఫారసుతోనే వాడాల్సి ఉంటుంది.

కరోనాకు ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మాత్రలను మన దేశంలో హెటెరో, డాక్టర్ రెడ్డీస్ సహా 13 ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. ఆయా సంస్థను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో మ్యాన్‌కైండ్ మాత్రం రూ. 1,399కే అందుబాటులోకి తీసుకురాగా, సన్‌ఫార్మా రూ. 1,500, డాక్టర్ రెడ్డీస్ రూ. 1,400 ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అమెరికాలో మాత్రం వీటి ధర భారత కరెన్సీలో రూ. 52 వేలు. ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే తక్కువగా ఉండడంతోపాటు ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్లను ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి నిచ్చింది.

  • Loading...

More Telugu News