nedendla manohar: పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే ఇదేనా?: సంక్రాంతికి ఏపీ ఆర్టీసీ టికెట్ల రేటు పెంపుపై నాదెండ్ల ఫైర్
- ఏపీలో 50 శాతం పెంచారు
- మన జనం జేబులు గుల్ల చేయడమేమిటి?
- మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్న నాదెండ్ల
ఏపీలో సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సు టికెట్ల రేట్లు పెంచడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలసకు వెళ్లిన ప్రజలు పండుగలకు తమ గ్రామాలకు వస్తుంటారని, బస్సు టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం 50 శాతం పెంచిందని ఆయన విమర్శించారు.
ఈ విషయంపై ఈ రోజు నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు.
'పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే ఆర్టీసీ సంక్రాంతి బస్సుల్లో ఛార్జీలు 50 శాతం పెంచడమా వైఎస్ జగన్ గారూ? సంతోషంగా పండగకి ఊరు వచ్చే మన జనం జేబులు గుల్ల చేయడమేమిటి? తమ రాష్ట్ర సంక్రాంతి బస్సుల్లో బాదుడు లేదు అని తెలంగాణ ఆర్టీసీ ప్రచారం చేస్తోంది. అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది' అని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.