money tips: డబ్బు సంపదగా మారాలంటే.. ఈ ఐదూ ఆచరించాల్సిందే.!

Essential tips to grow your money over time

  • లక్ష్యాల్లో స్పష్టత ఉండాలి
  • ఆచరణ పక్కాగా ఉండాలి
  • సంపాదనలో మిగులు ఉండాలి
  • క్రమశిక్షణగా పెట్టుబడులు కొనసాగాలి
  • రుణాలకు దూరంగా ఉండాలి

ఒక స్థాయి వరకు డబ్బును కష్టపడి కూడబెట్టుకుంటే.. ఇక ఆ తర్వాత మొదలవుతుంది కాంపౌండింగ్ మహిమ.  పిల్లల మీద పిల్లలు పెట్టుకుంటూ సంపదగా మారుతుంది. కొన్ని తరాలకు ఢోకా లేకుండా చేస్తుంది. ఇదంతా కళ్లారా చూడాలంటే కొన్ని ఆర్థిక సూత్రాలను పాటించాలంటున్నారు నిపుణులు.

లక్ష్యాన్ని చేరుకోవాలంటే... 
గమ్యం లేని ప్రయాణం వల్ల లాభం ఏమైనా ఉంటుందా..? అలాగే, సంపాదిస్తూ తన అవసరాలను తీర్చుకుంటూ వెళ్లడంతో సాధించేమీ ఉండదు. చక్కని ప్రణాళికతో సాగిపోవాలి. పెళ్లి, ఇల్లు, పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్ తర్వాతి జీవనం.. ఇలా అన్నింటికీ ప్రణాళికలు ఉండాలి. అప్పుడప్పుడూ విహార యాత్రలకు వెళ్లాలన్నా, కారు కొనుగోలు చేసుకోవాలని అనిపించినా వాటిని కూడా లిస్ట్ లో వేసుకోవాలి.

ఇప్పుడు ప్రతీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఒక్కో బాస్కెట్ కోసం ఎంత చొప్పున పొదుపు చేయాలో స్పష్టతకు రావాలి. అందుకు ఎన్నేళ్ల వ్యవధి ఉంది. ఎంత రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలి.

పరిధిలోనే ఖర్చు
ఎంత సంపాదించామన్నది కాదు.. సంపాదించిన దానిలో ఎంత పొదుపు చేశామన్నదే సంపద శాస్త్రంలో కీలకమైన ఆచరణ. క్రెడిట్ కార్డులు, ఒక్క రోజులో మంజూరయ్యే రుణాలు, ఇప్పుడు ఖర్చు చేసుకో, తర్వాత చెల్లించుకో.. ఇవన్నీ ఫైనాన్షియల్ కంపెనీలకు వ్యాపారం. కానీ, మనకు కాదు. కొనుగోలు ఏదైనా సంపాదించిన మొత్తంలో మిగులుతోనే చేయాలి. రుణంపై (ఇల్లు మినహా) కొనుగోలు అస్సలు సూచనీయం కాదు. కొనుగోలు ఏదైనా లక్ష్యాల జాబితాలోకి చేర్చి, కావాల్సినంత సమకూరిన తర్వాతే అడుగు వేయాలి.

ముందు నుంచే పెట్టుబడులు
సంపాదన మొదలైన నాటి నుంచే పెట్టుబడులు ప్రారంభించాలి. 20ల్లో సంపాదన మొదలైతే.. ఇన్వెస్ట్ మెంట్ కు 40 ఏళ్లు మిగిలి ఉంటుంది. పెట్టుబడిపై రాబడి, ఆ రాబడిపై రాబడి, ఆ రాబడిపై రాబడితో రిటైర్మెంట్ నాటికి మీ సంపద మర్రిమానును తలపిస్తుంది. 30ల్లో ఆరంభిస్తే చాలా శ్రమ కోర్చాలి. 40ల్లో కూడబెట్టడం మొదలు పెడితే సంపదకు దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది.

మెరుగైన సాధనాలు
‘సంపాదనలో ఎక్కువ మొత్తం కూడబెడుతున్నాను’ అని మీరు అనుకోవచ్చు. కానీ, ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఎందులో ఇన్వెస్ట్ చేశారన్నదే మీ అదృష్టాన్ని నిర్ణయించే మంత్రమవుతుంది. బ్యాంకు ఎఫ్ డీ, పీపీఎఫ్, పోస్టాఫీసు పథకాల్లో పెడితే పెద్ద రాబడి ఏముంటుంది? ఈక్విటీలు, రియల్టీకి పెట్టుబడుల్లో చోటివ్వాలి. రూ.100 తీసుకెళ్లి బ్యాంకు ఎఫ్ డీలో పెడితే 10 ఏళ్లలో రూ.200 అవుతుంది. కానీ, బ్లూచిప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో 2017 జనవరి 6న రూ.532 పెట్టుబడి పెట్టి ఒక్క షేరు కొంటే ఇప్పుడది రూ.2,417 అయి ఉండేది. ఈక్విటీలలో ఉండే మహిమ అది.

రక్షణ కోరుకునేవారు...
తన కుటుంబానికి రక్షణ కోరుకునే వారు ఆరోగ్యంపైనా పెట్టుబడి పెట్టాలి. చక్కని ఆరోగ్యం కోసం మంచి జీవనశైలి, జీవిత, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించుకోవాలి. పెట్టుబడులను నిర్ణీత కాలానికి సమీక్షించుకుంటూ వెళ్లాలి.

  • Loading...

More Telugu News