COVID19: ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అనుకోవడం ప్రమాదకరం: డబ్ల్యూహెచ్ వో తాజా హెచ్చరిక

The Rhetoric and Narratives That Omicron Is Mild Is Dangerous and Deadly Warns WHO Covid 19 Technical Lead
  • వేరియంట్ తీవ్రత తక్కువేమీ కాదు
  • అది మామూలు జలుబూ కాదు
  • డెల్టా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయ్
  • ఇలాగే అయితే ఆసుపత్రులు నిండిపోతాయ్
  • బీబీసీ ఇంటర్వ్యూలో డబ్ల్యూహెచ్ వో కొవిడ్ 19 టెక్నికల్ లీడ్ మరియా కెర్ఖోవె
ఒమిక్రాన్.. ప్రపంచం మొత్తాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వేరియంట్. దాని లక్షణాలు తక్కువగా ఉంటుండడంతో.. దాని తీవ్రత తక్కువే, ప్రమాదమేమీ లేదని నిపుణులు చెబుతూ వస్తున్నారు. లక్షణాలు, మరణాల రేటు తక్కువేనని డబ్ల్యూహెచ్ వో ఇన్సిడెంట్ మేనేజర్ అబీద్ మహమ్మద్ నిన్న చెప్పారు. అయితే, కేసులు పెరుగుతున్నాయని, వారాల వ్యవధిలోనే భారీగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

ఈ క్రమంలో తాజాగా డబ్ల్యూహెచ్ వో కొవిడ్ 19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవె కూడా ఒమిక్రాన్ తీవ్రతపై స్పందించారు. ‘‘ఒమిక్రాన్ తీవ్రత తక్కువ’’ అని జనాల్లోకి తీసుకెళ్లడం, వైరస్ ను తక్కువ అంచనా వేయడం అత్యంత ప్రమాదకరమని, ప్రాణాంతకమని హెచ్చరించారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్లు చేశారు.

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరే ముప్పు తగ్గినా.. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ తీవ్రత తక్కువేమీ కాదని , అదేమీ మామూలు జలుబు కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఒమిక్రాన్ తో పాటు డెల్టా కేసులూ పెరుగుతున్నాయని, ఇలాగే కేసులు పెరుగుతూ పోతే మున్ముందు ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో నిండిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

వృద్ధులు, ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఒమిక్రాన్ సోకే ముప్పుందని హెచ్చరించారు. కేసులతో పాటు మరణాలూ పెరిగే ప్రమాదముంటుందని హెచ్చరించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ అందరి మధ్యే ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
COVID19
WHO
Omicron
Maria Van Kerkhove
Delta

More Telugu News