Telangana: ఎమ్మెల్యే కుమారుడి వల్ల ఓ కుటుంబంలోని నలుగురు చనిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదు: రేవంత్ రెడ్డి

CM KCR Helped Vanama Venkateshwar Rao Revanth Responds To Selfie Video Of Ramakrishna

  • రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యపై స్పందన
  • ఘటనపై ప్రత్యేక న్యాయ విచారణ జరిపించాలి
  • ఎమ్మెల్యే, ఆయన కొడుకు మధ్యతరగతి ప్రజలను వేధిస్తున్నారు
  • ఇలాంటి ఘటనల విషయంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది?
  • ప్రతిపక్షాల ప్రజాపోరాటాలపై నిఘా పెట్టడమే పనా?

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ.. రామకృష్ణ ఫ్యామిలీని వేధించి చంపేశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆఖరుకు రామకృష్ణ భార్యపైనా అసభ్యంగా మాట్లాడి.. ఆ కుటుంబం చావుకు కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పింది వింటే.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వుందన్నారు. మనుషులు ఇలా మృగాలుగా మారి వ్యవహరిస్తున్నారని అన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో, ఆయన కుటుంబం ఆత్మహత్యపై రేవంత్ స్పందించారు.

మంచి పాలనను అందిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ, అధికారపార్టీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు.. మధ్య తరగతి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడి వల్ల ఓ కుటుంబంలోని నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటిదాకా ఆ మానవ మృగాన్ని అరెస్ట్ కూడా చేయలేదని, ఆ కుటుంబం మీద పార్టీపరంగా చర్యలు కూడా తీసుకోలేదని మండిపడ్డారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమీ ఉండదన్నారు.

ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు సీఎం కేసీఆర్ కు తెలియవా? అని ప్రశ్నించారు. రాఘవ అరాచకాలు సీఎంకు తెలియకపోవడమేంటని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందన్నారు. ప్రతిపక్షాల ప్రజాపోరాటాలపైన నిఘాకే పరిమితమైందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారసులు మాఫియాను మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఈ ఘటనలో వనమా వెంకటేశ్వరరావుకు ముఖ్యమంత్రి అండదండలు ఉండడం వల్లే పోలీసులు రాఘవను అరెస్ట్ చేయలేకపోయారని ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని, రాఘవ అంత దారుణంగా మాట్లాడినా సీఎంకు ఎందుకు చర్యలు తీసుకోవాలనిపించడంలేదని ప్రశ్నించారు. ఘటనపై ప్రత్యేక న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు.

  • Loading...

More Telugu News