Narendra Modi: మోదీని తరిమికొట్టారు... ఇది ఖలిస్థాన్ స్వాతంత్ర్యానికి నాంది: గుర్ పత్వంత్ సింగ్
- పంజాబ్ లో నిన్న మోదీని అడ్డుకున్న రైతులు
- రానున్న ఎన్నికలు ఖలిస్థాన్ కు రెఫరెండం వంటివని వ్యాఖ్య
- పంజాబ్ స్వతంత్ర దేశంగా అవతరించాలని కోరుకుందన్న గుర్ పర్వంత్ సింగ్
భద్రతా పరమైన వైఫల్యాల కారణంగా నిన్న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ కాన్వాయ్ ను భారతీయ కిసాన్ మోర్చా అడ్డుకుంది. దీంతో ఫ్లయ్ ఓవర్ పై 20 నిమిషాలు ఆగిపోయిన మోదీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.
దీనిపై సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గుర్ పత్వంత్ సింగ్ స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోదీని పంజాబ్ నుంచి సిక్కులు తరిమికొట్టారని... ఇది ఖలిస్థాన్ స్వాతంత్య్రానికి నాంది అని అన్నారు. మోదీని అడ్డుకున్న రైతులను ప్రశంసించారు. త్వరలో పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఖలిస్థాన్ కు రెఫరెండం వంటివని అన్నారు.
ఖలిస్థాన్ రెఫరెండానికి నిన్నటి నుంచి ప్రచారం ప్రారంభమైందని... దీన్ని మోదీ ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు. భారత జాతీయ జెండాను ధరించినవారు ఢిల్లీకి వెనుదిరగాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. కాలికి చెప్పులు కూడా లేకుండానే ప్రధానిని పంజాబ్ రైతులు తరిమికొట్టారని అన్నారు. స్వతంత్ర దేశంగా అవతరించాలని పంజాబ్ నిర్ణయించుకుందని చెప్పారు.
ఆయుధాలతో పంజాబ్ కు వచ్చిన ఇందిరాగాంధీకి ఆయుధాలతోనే సమాధానం లభించిందని అన్నారు. ఇప్పుడు మోదీ పంజాబ్ లో అలజడి సృష్టిస్తున్నారని... ఆయనకు శాంతియుతంగా ఓటుతో సమాధానం చెపుతామని వ్యాఖ్యానించారు. ఖలిస్థాన్ కు సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్దూతో పాటు బీజేపీ, ఆప్ తదితర పార్టీలు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా సిక్కుల ఆయుధం ఖండాను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.