Suryanarayana: ప్రభుత్వంతో మరో సమావేశం ఉంటుందని భావించడంలేదు: ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ
- సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ
- తమ డిమాండ్లపై చర్చలు
- డిమాండ్లపై పట్టువిడుపు ఉండాలన్న సీఎం
- ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామన్న ఉద్యోగ సంఘం నేత
సీఎం జగన్ తో సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ స్పందించారు. సమావేశం వివరాలను పంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజంటేషన్ రూపంలో వివరించారని తెలిపారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్ మెంట్ లను ప్రస్తావించారని వెల్లడించారు.
అందుకు తాము బదులిస్తూ... ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరామని చెప్పారు. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని సూర్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. అటు, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉద్యోగులకు కూడా మెరుగైన ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరామని అన్నారు. ప్రస్తుతం తీసుకునే నిర్ణయం కొన్నేళ్లపాటు ప్రభావం చూపుతుందని సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు.
తమ అభిప్రాయాలను సీఎం జగన్ విన్నారని, రాష్ట్ర ప్రయోజనాలు, పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలని కోరారని వెల్లడించారు. డిమాండ్లపై పట్టువిడుపు ఉండాలని సూచించారని, రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వివరించారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని, మరో సమావేశం ఉంటుందని తాము భావించట్లేదని సూర్యనారాయణ స్పష్టం చేశారు.