Andhra Pradesh: పెరుగుతున్న కరోనా కేసులు.. కడప జిల్లాలో కోవిడ్ ఆంక్షల విధింపు!
- కోవిడ్ రూల్స్ కచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ ఆదేశం
- మాస్కులు ధరించకపోతే కేసుల నమోదు
- పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు పరిమితికి మించి ప్రజలు హాజరు కాకూడదు
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. ఈరోజు నుంచి కోవిడ్ రూల్స్ ను కఠినంగా అమలు చేయబోతున్నామని జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేయబోతున్నామని... మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ప్రకటించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు కచ్చితంగా ధరించాలని చెప్పారు. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరు కావాలని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రజలు హాజరైతే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
దుకాణాల ముందు షాపు యజమానులు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేయాలని చెప్పారు. షాపుల ఎదుట తాడు కట్టాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసు శాఖకు ప్రజలంతా సహకరించాలని కోరారు.